ప్రభు ప్రేమ తొలికేక - హృదయములో ప్రతి ధ్వనియించె
పాపక్షమ - యేసునిలో - శరణునొసంగుచు కనిపించె
పాపవికారము పొడసూప - జీవిత విలువలు మరుగాయె
పతితనుగా లోకములో - బ్రతుకుటయే నాగతియాయె
పలువురిలో కనబడలేక - దాహముతో నేనొంటరిగా
బావికని పయనింప - నాధుని దర్శన మెదురాయె
పావనుడు దాహముతో - పానము నిమ్మని ననుకోరె ||ప్రభు ||
జాతిని చూడని నేత్రముతో - పాపము సోకని హృదయముతో
జాలిని చాటించుచునే - తాకెను నామది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియె - దాచుకొనిన నా పాపమును
జడియుచునే తెలిపితిని - ప్రభువెెరిగిన నానిజస్థితిని
జయమొందె నా తనువు - సరిగనుడితివని ప్రభు తెలుప ||ప్రభు ||
దేహమునే నా సర్వముగా - భావించుచు మది పూజింప
దినదినము జీవితము - చావుగ మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా - మరణ ప్రవాహము ఛేదించి
దరిచేర్చి దీవించి - నూతన జన్మ ప్రసాదించే
దయ్యాల కుహరమును స్తుతి మందిరముగ రూపించే ||ప్రభు ||
పాపము దాగొను నాబావి - లోతును ఎరుగని వారెవరు
పోరాట వాటికయౌ - నా బ్రతుకును జూచిన దెవరు
పాపికిని పాపమునకును - భేదము జూపిన వారెవరు
పాపిని కాపాడుటకై - సిలువ ధరించిన వారెవరు
పరదైసుద్వారములు - ప్రేమతో తెరిచెను నా కొరకై ||ప్రభు ||