Chorus
దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁకమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా‖ దినము ‖
Verse
సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా
దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము‖ దినము ‖
Verse
కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెంగట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు‖ దినము ‖
Verse
తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము
వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి‖ దినము ‖
Verse
ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము
మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ‖ దినము ‖
Verse
ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ
నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము‖ దినము ‖
Verse
అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ
తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ‖ దినము ‖
Verse
అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము
త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ‖ దినము ‖
Verse
దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి
సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక‖ దినము ‖