Chorus
నడిపించు నానావ నడిసంద్రమున దేవా
నవజీవన మార్గమున నాజన్మ తరియింప‖ నడిపించు ‖
Verse
నా జీవిత తీరమున నా యపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించు లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము‖ నడిపించు ‖
Verse
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవ‖ నడిపించు ‖
Verse
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశయే ఆవేద నెదురాయే
ఆథ్యాత్మిక లేమిగని అల్లాడె నావలలు‖ నడిపించు ‖
Verse
ప్రభు మార్గమి విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీమాట‖ నడిపించు ‖
Verse
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబును సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని యర్పణగా లోకేశజేయుమయ‖ నడిపించు ‖
Verse
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని! ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు ప్రానార్పణము చేతు‖ నడిపించు ‖