Chorus
పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం
బొనర్చుట పరమ విధియని చూపుమా‖ పరమ ‖
Verse
ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ
రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా‖ పరమ ‖
Verse
భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే
వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా‖ పరమ ‖
Verse
కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల
యాశ్రయముల నంటి పరామర్శించుమా‖ పరమ ‖
Verse
లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ
దీవెనల సమకూర్చుమా‖ పరమ ‖
Verse
యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర
తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా‖ పరమ ‖
Verse
గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ
గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా‖ పరమ ‖
Verse
దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే
రోగములు మటు మాయ మగు నని కరపుమా‖ పరమ ‖
Verse
దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ
మగు నీ దేవళములుగ మార్చుమా‖ పరమ ‖